తేదీ : 15-09 -2019 స్థలం : ఎ . వి కాలేజ్, దోమలగూడ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, సమయం :ఉదయం 10. 00 గంటల నుండి 5.00 గంటల వరకు
మిత్రులారా!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పౌర హక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రం 3 వ మహాసభను జరుపుకుంటుంది ,
పౌర హక్కుల ప్రజా సంఘం [పి.యు.సి.యల్ ]-- నిరంతరం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది. 1975 లో ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని 43 వ సవరణ చేసి, అత్యవసర పరిస్థితి [ఎమర్జెన్సీ] ని దేశం మొత్తం విధిస్తూ, ప్రజలను, ప్రజానాయకులను అక్రమంగా నిర్బందించి , ప్రాధమిక హక్కులను అన్నింటిని రూపుమాపింది. లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ముందడుగు వేసి ప్రజాస్వాముకు లందరిని జత చేసి పి.యు.సి.యల్ ను నిర్మించారు. 1977 లో అమాయకులను, సామాన్య ప్రజలను ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తున్నప్పుడు, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ V. M తార్కుండే, అరుణ్ శౌరి, నాబ కృష్ణ చౌదరి, కె. ప్రతాప్ రెడ్డి, ఎం. వి రామమూర్తి, కాళోజి నారాయణ రావు, B. G వెర్గీస్, K. G కన్నాబిరాన్, మరియు బల్వంత్ రెడ్డి లతో పి .యు.సి.యల్ ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాడు. ఈ కమిటీ రెండు రిపోర్టులను తయారు చేసి ఇచ్చారు. అప్పుడే కేంద్ర ప్రభత్వం భార్గవ కమిషన్ ఏర్పాటు చేసింది.
పి.యు.సి.యల్, ప్రజలకోసం, పనిహక్కు, ఆహార భద్రత హక్కు, విద్యా హక్కు, సమాచార హక్కు, ఎన్నికలలో నిలబడిన/ప్రజలకు నచ్చని వ్యక్తులను తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉండాలని ఉద్యమించి సాధించినదే "నోటా". ఎదురు కాల్పులు జరిగినప్పుడు "జ్యూడిషల్ విచారణ" జరిపించాలనే డిమాండ్ ను పి.యు.సి.యల్ ప్రభుత్వం ముందు పెట్టింది. సాధారణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పి .యు.సి.యల్, పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు దాటి పోయింది. సామాన్య ప్రజల మానవహక్కుల పరిరక్షణ గూర్చి ఎలాంటి కృషి జరగట్లేదు. మానవహక్కులకు రక్షణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో లేవు. ఒక వైపు న్యాయస్థానాలు "ఎదురుకాల్పుల"లో పాల్గొంటున్న పోలీసులపై ఐపిసి సెక్షన్ 302 పెట్టి విచారించాలి అని చెపుతున్నప్పటికిని, యథేచ్ఛగా ఎదురుకాల్పులు రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎదురు కాల్పులలో పాల్గొన్న పోలీస్ అధికారులపై ఐపిసి సెక్షన్ 302 కింద కేసు రిజిస్టర్ చేయాలి అని మళ్ళీ మళ్ళీ న్యాయస్థానాల తలుపులను తట్టవలసి వస్తుంది. ప్రభుత్వాలు ఒకవైపు ప్రజా రక్షణే తమ ధ్యేయం అని చెపుతున్నప్పటికిని, ప్రజలకు రాజ్యాంగ బద్ధంగా కలిపించిన హక్కుల రక్షణ కోసం, అమలు కోసం, జాతీయ మానవహక్కుల కమిషన్ న్ని , రాష్ట్ర మానవహక్కుల కమిషన్ని , ఇతర కమిషన్ ల తలుపులను పేదప్రజలు తట్టవలసిన పరిస్థితులు దిన దినం పెరుగుతున్నది.
రాష్ట్ర మానవహక్కుల కమిషన్ రాష్ట్రం లో ఉండి కూడా లేనట్టే ఉంది. కమిషన్ ఛైర్మెన్, అందులోని సభ్యులు రిటైర్డ్ అయిపోయారు. సామాన్య ప్రజలకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఒక దిక్కుగా ఉండే, నేడు దిక్కులేని కమిషన్ గా ఉంది.రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికిని రాష్ట్ర ప్రభుత్వమ్ బేఖాతర్ చేసిందే కానీ, ప్రభుత్వ బాధ్యతను గుర్తుంచక పోతుంది. దీని విషయం పై ప్రభుత్వ బాధ్యతను తెలియ చేసేటందుకు ప్రజలు నిరసన కార్య క్రమాలను చేపట్టాల్సిన దౌర్భాగ్యం దాపురించింది.
దేశ వ్యాప్తంగా యురేనియం తవ్వకాలపై ప్రజలనుండి వ్యతిరేకత ఉన్నప్పటికినీ ప్రభుత్వాలు వెనక్కి తగ్గటం లేదు. ఎందుకు అనే విషయాన్ని పక్కన పెట్టలేము. ప్రభుత్వాలు ఒక మంచి "బ్రోకర్" గా బహుళజాతి సంస్థలకు పనిచేస్తున్నాయి అనేది నిస్సందేహం.
యురేనియం రసాయనిక చర్యలో అత్యంత ప్రమాదకరమైన బీటా, గామా కిరణాలను వెదజల్లుతుంది. దీనిలో అణుధార్మికత గాలిలో ప్రవేశించిన తర్వాత మనుషుల శరీరాల్లోకి, జంతువుల శరీరాల్లోకి ప్రవేశించి ఎముకల్లో స్థిరపడుతుంది. దీనితో చాలా సులభంగా క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుంది. భూమి లోనుంచి యురేనియంను బయటకు తీయడమే ఆలస్యం గాలితో చర్య జరిపి విషంగా మారుతుంది.
యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతంలో ముడి ఖనిజం నుంచి వెలువడిన రేడియో ధార్మిక పదార్థాలు వేల సంవత్సరాలు వాతావరణంలోనే ఉండిపోతాయి. తద్వారా గాలి పీల్చిన మనుషులు, జంతువులు, నీరు, భూమి పైన ఉన్న అన్ని రకాల జీవరాశులు కలుషితం అవుతాయి. వివిధ రకాల జబ్బులతో చనిపోతాయి. ఉదాహరణకు నీటిని తాగిన జంతువులు, మనుషులు ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ తో చనిపోతారు మరియు వందల తరాలు వికృత సంతానం తో, లేదా పూర్తిగా సంతానలేమితో, మానసిక రుగ్మలతో తీవ్రమైన చిత్రవధలకు గురౌతారు, పెద్ద ప్రమాదం ప్రకృతికి జరుగుతుంది. పర్యావరణం కు పెద్ద ముప్పు జరుగబోతది. యురేనియం తవ్వకాలు చాలా ప్రమాదం అని తెలిసినప్పటికిని నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ ను ఆనుకొని ఉన్న నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వమే బహుళజాతి సంస్థకు ఏజెంట్ గా మారింది.
జీవ వైవిధ్యానికి, దట్టమైన అడవికి నల్లమల నిలయం. పక్కనే నాగార్జునసాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ లు. ఈ డ్యాం లలో ఉండే నీళ్లు వ్యవసాయానికి, మనుషులు, పశు పక్ష్యాదులు తాగేటందుకు ఉపయోగపడుతుంది. హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలకు, ముఖ్యమంత్రితో సహా శ్రీశైలం డ్యాం నుండి వచ్చే నీళ్లు తాగుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రము మరియు గాలి ఎంతదూరం ప్రయాణిస్తే అంతదూరం యురేనియం తవ్వకాల నుండి వచ్చే "విషం" అంతదూరం గాలితో పాటు ప్రయాణిస్తుంది. ఈ చిన్న విషయం ఎందుకు, ప్రభుత్వాలకు అర్ధం కావట్లేదు. బహుళ జాతి సంస్థల అధిపతులు కూడా ఈ భూమిమీదనే బ్రతుకుతున్నారు కదా ? వారికి కూడా కామన్ సెన్స్ అనేది తట్టటం లేదా ? అని ఓ గొప్ప సందేహం ప్రజలలో వుంది.
ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను సరిదిద్దేటందుకు ప్రజలు యురేనియం తవ్వకాల కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు , ఈ పోరాటం రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ సరిహద్దులను దాటుకుంటూ .. సామాన్య ప్రజల జీవించే హక్కుకోసం, స్వేచ్ఛకోసం నిరసనలు తెలిపేటందుకు ప్రజలు ఏకం అవుతున్నారు .. ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా పౌర హక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రం తేదీ : 10-08-2019 న అమ్రాబాద్ ప్రాంతంలోని ప్రజలను, నల్లమల అడవిలో జీవిస్తున్న చెంచుపెంటలలో పర్యటించింది, క్షేత్ర స్థాయిలో ప్రజలను పౌర హక్కుల ప్రజా సంఘం తెలంగాణ రాష్ట్రం పరిశీలిస్తే ... " ప్రజలకు పెద్దన్నగా ఉంటానన్న కెసిఆర్" యురేనియం తవ్వకాల కు " పెద్దరికం" వహించటం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు అనేది స్పష్టం అయ్యింది. భారత రాజ్యాంగం లో మనది "సంక్షేమ రాజ్యం " అని రాసి ఉన్నది, ప్రజలను మాయమాటలతో, డబ్బుతో మోసం చేసి, వాళ్ళ ఓట్లతోనే గెలిసి గద్దెను ఎక్కాక " ప్రభుత్వాలు" తమ సంక్షేమం కోసం పనిచేసుకుంటున్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తలకిందులు చదువు కుంటున్నాయి .. అందుకే హక్కుల ఉల్లంఘనలకు, పోలీసులను, కొంత మంది ప్రభుత్వ అధికారులను, వీరితో కాకపోతే "ప్రైవేట్" సైన్యాలను వాడుతూ నిస్సిగ్గుగా పాల్పడు తున్నాయి.
ఈ మధ్య పార్లమెంట్ లో న్యాయరహిత కార్యకలాపాల నిరోధక చట్టం ( UAPA ) ను మరియు మానవహక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన 1993 మానవహక్కుల చట్టంలో మార్పులు తీసుకవచ్చేటందుకు చర్చ జరిగింది. కొత్త బిల్లు కూడా వచ్చింది.
మన రాజ్యాంగం లో ఆర్టికల్ 19 నుండి 21 వరకు స్వేచ్ఛ, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, సభలు సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ పత్రిక స్వేచ్ఛ .. లు రాసివున్నాయి. వీటిని ప్రజాస్వామ్య బద్ధంగా అమలు జరపవలసిన బాధ్యత ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలపై ఉంది. కానీ వీటికి వ్యతిరేకంగా UAPA చట్టం ఒకటి ఉంది. దీనిని ఎప్పటికప్పుడు ఆమెండ్మెంట్ చేస్తూ "ప్రభుత్వాలకు అనుకూలంగా " లేని వ్యక్తులపై, సంస్థలపై ప్రయోగిస్తూ న్నారు. రాజ్యాంగ బద్ధంగా చట్టాలను ఏర్పాటు చేయాలిగాని, ప్రభుత్వాల మనుగడకోసం చట్టాలను ఏర్పాటుచేసుకునేటందుకు "రాజ్యాంగం" ను ఆమెండ్మెంట్ చేయటం కాదు. అదియేల అంటే UAPA చట్టంలో సెక్షన్ 35, 36 లు దేశంలో ఏ వ్యక్తినైనా, సంస్థనైనా తీవ్రవాదిగా ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది, దీనికి అనుకూలంగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు పనిచేయవలిసిందే. ఇది పూర్తిగా ప్రజల జీవించే హక్కును కాలరాయటమే. .
1993 మానవహక్కుల చట్టంలో సెక్షన్ 30 ప్రకారం మానవహక్కుల న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి అని చెపుతుంది. కానీ రాష్ట్రం లో అలంటి న్యాయస్థానాలు లేవు, కానీ సామాజిక కార్యకర్తలు అప్పుడప్పుడు జిల్లా కోర్టు న్యాయమూర్తులదగ్గెర "హక్కుల ఉల్లంఘనల" పైన కేసులు వేస్తే, హక్కుల కమిషన్ ల దగ్గెరకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. 2016లో నే న్యాయస్థానాల ఏర్పాటును తప్పని సరి చేస్తూ చట్టాన్ని సవరించాలని కమిషన్ కోరింది. కనీసం ఈ బిల్లులోనైనా ఆ ప్రస్తావన లేదు. మరి బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటో ? ఎవరికోసం ఈ బిల్లో
తెలియరాలేదు.
ఇకపోతే, హైదరాబాద్ పాత నగరం లో "ప్రజల హక్కులే" కనుమరుగౌతున్నాయి. అందుబాటులో చదువుకునే బడులు లేవు, బ్యాంకులు లేవు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల నుండి అధిక వడ్డీలకు అప్పులు చేయాలి, పార్కులను కబ్జా పెట్టి ప్లాటింగ్ లు చేసి "పెద్దలు" అమ్ముకున్నారు, ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి ఎవ్వరూ మాట్లాడరు, మాట్లాడిన వారిని "మా ఇలాకాలోకి" వచ్చి మాట్లాడు తున్నారు అని దాడులు చేస్తారు. కొన్నిరాజకీయ పార్టీలు [పాత బస్తీలో బలంగా వున్నవి], అమాయక ప్రజల "హుందాగా, గౌరవంగా జీవించే హక్కును నలుపుతున్నారు" అనేది ప్రభుత్వాలకు తెలుసు, అయినా వారికీ పట్టనట్లు ఉండటం చేత సామాన్య ప్రజలు ఎవ్వరిని ఆశ్రయించాలినో తెలియని అయోమయం లో వున్నారు.
మరియు పాత బస్తీని కొందరు రాజకీయ నాయకులకు మన ప్రభుత్వాలు " హీబా -గిఫ్ట్ " గా రాసి ఇచ్చినట్లు ఉంది. అక్కడ జీవించే ప్రజలు, ప్రభుత్వ అధికారులు " హీబా -గిఫ్ట్ " లోని టర్మ్స్ & కండిషన్స్ ల ప్రకారం నడుచుకోవలసివస్తుందా ?! అని ఒక ప్రశ్న , ఆశ్చర్యం కలుగుతుంది అక్కడ పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలకు. అక్రమంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తే, దాన్ని ప్రశ్నిస్తే అది ఒక నేరం, MLA , MP , GHMC ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి అని అడిగిన తప్పు. మానవ హక్కులకు అక్కడ భద్రత ఎలా ఉంటుంది. ప్రభుత్వాలు అక్కడి ప్రజలను ఓట్ బ్యాంక్ గా చూసేంతవరకు, అక్కడ జీవిస్తున్న ప్రజలకు, హక్కులకు ఎక్కడ రక్షణ. ఆ ప్రాంతం లో పనిచేస్తున్న అధికారులు .. ఓట్ బ్యాంకు రక్షకులుగా, రాజకీయ నాయకుల కనుసైగలలోనే పనిచేయాలి అనే సంస్కృతి ఉన్నంతవరకు .. అధికారులు స్వేచ్ఛగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు అని చెప్పటం ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి ఒక ఉదాహరణ.
ఇటువంటి పరిస్థితులలో పౌర హక్కుల ప్రజా సంగం, తెలంగాణ రాష్ట్రం (పి.యు.సి.యల్ - తె .రా ) ప్రజలకు , మేధావులకు పిలుపునిస్తుంది మానవ హక్కులకు చీకటి రోజులు గా మారబోతున్న పరిస్థితులను అడ్డుకుందాము. మానవ హక్కుల కు రక్షణ వచ్చేవరకు నడుం కట్టి ముందుకు అడుగు వేద్దామని అందరిని ఆహ్వానిస్తుంది. క్రియాశీలకంగా చేపట్టవలసిన కార్యక్రమాలను ఈ మహాసభలో చర్చిస్తుంది.
క్రియాశీలురందరు పాలుగొని సభలను జయప్రదం చేయాలనీ ఆహ్వానిస్తున్నాం.
ఇట్లు
పౌర హక్కుల ప్రజా సంఘం [పి.యు.సి.యల్ ] ఆహ్వాన కమిటి, తెలంగాణ రాష్ట్రం
=================================
ప్రచురణ: పౌర హక్కుల ప్రజా సంఘం [పి .యు . సి . యల్ ] ఆహ్వాన కమిటి # 16-8-913/డి , మలకపేట్ క్రాస్ రోడ్, నియర్ మలకపేట్ రైల్వే స్టేషన్, హైదరాబాద్, తెలంగాణ; 040-24414736 / 9440430263 / 9494869731
=================================